తెలుగు నేల రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఆహార్యాన్ని హావభావాలను సంపాదించుకున్న టీడీపీ సీనియర్ నేత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి… నిజంగానే పెను సంచలనమే. సొంత పార్టీ నేతలు విఫక్ష పార్టీ నేతలు అన్న తేడాలు దాదాపుగా ఆయన పట్టించుకోరనే చెప్పాలి. తాను ఎవరి గురించి అయితే మాట్లాడాలని అనుకుంటారో… ఏమాత్రం సంకోచం లేకుండా మాట్లాడేస్తారు. ఈ తరహా వైఖరితో ఇప్పటికే టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని పలుమార్లు అడ్డంగా బుక్ చేసిన జేసీ… తాజాగా మరోమారు కూడా ఆయనను బుక్ చేసి పారేశారు. గతంలో అంటే ఏదోలే అనుకుంటే… ఎన్నికలకు ముందు జేసీ ఇలా బుక్ చేయడంతో ఇప్పుడు బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
2014 ఎన్నికలకు ముందు దాకా కాంగ్రెస్ లో ఉన్న జేసీ… ఎన్నికలకు కాస్తంత ముందుగా టీడీపీలోకి చేరిపోయారు. ఆ తర్వాత తనకు ఎంపీ టికెట్ తో పాటు తన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించేసుకుని రెండు చోట్లా విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి ఆయన తనదైన శైలి వ్వవహారంతో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. అయినా ఇప్పుడు చంద్రబాబును జేసీ ఎలా బుక్ చేశారన్న విషయానికి వస్తే
జేసీ వ్యాఖ్యలు ఎలా సాగాయంటే… *ఢిల్లీలో బాబు దీక్షతో ఎలాంటి ఉపయోగం లేదు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ఈ దీక్షతో ఫలితం ఉండదని చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ ప్రయత్నం వదిలి పెట్టకూడదని అలా చేస్తున్నారు. యుద్ధం జరుగుతుందని శ్రీకృష్ణుడికి తెలుసునని అయినను హస్తినకు పోయి రావలెనని అన్నారు కదా. ఇది కూడా అంతే. ఢిల్లీలో దీక్షతో ఎలాంటి లాభం లేదని చంద్రబాబుకు తెలిసినా… ఏదో దీక్ష చేయాలంటే చేస్తున్నామన్నట్లుగా చేస్తున్నారంతే* అని జేసీ వ్యాఖ్యానించారు. అసలే ఎన్నికలు ఆపై ప్రభుత్వ వ్యతిరేకతతో ఎక్కడ కిందపడతామో అన్న కోణంలో చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే… జేసీ ఈ తరహా వ్యాఖ్యలు చేసి.. అసలు హోదాపై తామేమీ సీరియస్గా లేమన్నట్లుగా చెబితే ఎలా? అన్న వాదన వినిపిస్తోంది. మరి జేసీ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.