1. ఆలస్యం
‘డార్లింగ్! మనం ఫంక్షన్‌కి ఆలస్యం అయినట్టున్నాం’
‘ఎలా చెప్పగలుగుతున్నారు’
‘ఫంక్షన్‌కి వెళ్లినవాళ్లంతా ఎదురొస్తున్నారు’
‘మీ మొహం! ముందా కారుని రాంగ్ వేలో తోలడం ఆపండి’
2.ఇద్దరూ ఇద్దరే!
పరమానందం తన మిత్రుడితో కలిసి క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. మ్యాచ్ మొదటి ఓవర్లోనే ఆటగాడు సిక్స్ కొట్టాడు.
పరమానందం: వాహ్… భలే గోల్ కొట్టాడు కదూ!
మిత్రుడు: నీ మొహం. అది గోల్ కాదు సిక్స్. గోల్‌ని క్రికెట్‌లో కొడతారు!!!
3.పగ… పగ… పగ
ఒక పెద్దాయన రోజంతా పార్కులో కూర్చుని కనిపించేవాడు. ‘రోజూ ఇక్కడ కూర్చోవడం వల్ల ఏంటి లాభం!’ అని అడిగాడుఓ పేరయ్య.
పెద్దాయన: నేను కూర్చునీ కూర్చునీ పగ తీర్చుకుంటున్నాను
పేరయ్య: ఎవరి మీద
పెద్దాయన: కాలం నా జీవితాన్ని నాశనం చేసింది. అందుకని నేను ఇప్పుడు కాలాన్ని నాశనం చేస్తున్నాను
4.అవసరమా!
సుబ్బారావు: జడ్జిగారూ! మా ఆవిడ నుంచి విడాకులు కావాలంతే!
జడ్జి: కారణం!
సుబ్బారావు: ఓ ఏడాది నుంచి ఆవిడ నాతో మాట్లాడటమే లేదు.
జడ్జి: ఇంకోసారి ఆలోచించుకో! అంత ప్రశాంతమైన కాపురం నీకెక్కడా దొరకదు.
5.కమింగ్ సూన్
వార్త- ఆ హీరోగారి వెయ్యో చిత్రం విడుదల అవుతోంది. పోస్టరు మీద ఇంతెత్తు హీరో బొమ్మ ముద్రించి, దాని కింద ‘కమింగ్ సూన్’ అని రాశారు. దాన్ని ఊరంతా అంటించారు. అయినా హీరోగారు అలిగారు. కారణం….
పనిలో పనిగా…. ‘కమింగ్ సూన్’ పోస్టరుని శ్మశానంలో కూడా అతికించేశారు.
6.సందిగ్ధం
భార్య: ఏమండీ! మన వంటింట్లోకి దొంగ దూరాడండీ! నేను చేసిన బిర్యానీ కూడా తినేశాడని అనుమానంగా ఉంది!
భర్త: అయితే మనం ఇప్పుడు పోలీసులని పిలవాలా? ఆంబులెన్సుని పిలవాలా?
7.సంతోషించక
‘సిగ్గు లేదూ! వందకి అయిదు మార్కులు వచ్చినా పళ్లికిలిస్తున్నావు?’
‘ఖాళీ పేపర్‌కి అయిదు మార్కులు వేస్తే సంతోషపడరా ఏంటి మేడం!’
8.ప్రేమకి ఎన్ని అర్థాలో
ఎనిమిదేళ్ల పిల్లవాడు: ఐ లవ్యూ మమ్మీ.
తల్లి: ఐ లవ్యూ టూ కన్నా!
పదహారేళ్లప్పుడు: ఐ లవ్యూ మమ్మీ.
తల్లి: సారీ బాబూ! నా దగ్గర డబ్బులు లేవు.
ఇరవై నాలుగేళ్లకి: ఐ లవ్యూ మమ్మీ.
తల్లి: ఎవర్రా అదీ… ఎక్కడుంటుందీ!
ముప్పై రెండేళ్లు: ఐ లవ్యూ మమ్మీ.
తల్లి: నేను అప్పుడే చెప్పానా! ఆ పిల్లని చేసుకోవద్దని.
నలభై ఏళ్లు వచ్చాక: ఐ లవ్యూ మమ్మీ.
తల్లి: చూడూ! నేను ఏ పేపరు మీదా సంతకం పెట్టేది లేదు.
9.అక్కడి దాకా వెళితే….
గిరిబాబు: డాక్టర్! మా ఆవిడ మెమరీ కార్డు మింగేసింది. అందులో మ్యూజిక్ ఫోల్డరులో ఉన్న పాటలన్నీ పాడుతోంది.
డాక్టర్: మరీ మంచిది. ఇందులో బాధపడాల్సింది ఏముంది?
గిరిబాబు: రేపో మాపో! వీడియో ఫోల్డర్ ఓపెన్ అయితే ఏం జరుగుతుందా అనీ…..